నేపాల్‌లో చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. ఇటీవల జరిగిన నేపాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మావోయిస్టు ఎంపీలు తొలిసారి ఆ దేశ రాజ్యాంగ అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ మధుర క్షణాల కోసం మావోయిస్టు ఎంపీలు ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగ అసెంబ్లీ తొలి సమావేశం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా ప్రకటించారు. ఈ సభ భేటీతో 240 సంవత్సరాల రాచరిక వ్యవస్థ అంతమైనట్టే. ఇటీవల సమావేశమైన ఏడు పార్టీల నేతలు రాజ్యాంగ అసెంబ్లీ తొలి సమావేశ తేదీని ఖరారు చేసే బాధ్యతను ప్రధాని కోయిరాలాకు అప్పగించిన విషయం తెల్సిందే.
వారి విజ్ఞప్తి మేరకు ప్రధాని తేదీని ఖరారు చేశారు. దీంతో మొత్తం 601 సభ్యులు కలిగిన నేపాల్ రాజ్యంగ అసెంబ్లీ తొలి సమావేశం 28న జరుగనుంది. ఈ తొలి సమావేశం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు బిరేంద్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుందని నేపాల్ టెలివిజన్ ప్రకటించింది. కాగా, సమావేశం జరుగనున్న కన్వెన్షన్ సెంటర్ సమీపంలో గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలావుండగా 601 సభ్యులు రాజ్యాంగ అసెంబ్లీలో 575 మంది సభ్యులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న విషయం తెల్సిందే. మిగిలిన 26 మందిని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నామినేట్ చేస్తుంది. ఈ తొలి సమావేశంలో నేపాల్ రాచరిక వ్యవస్థను రద్దు చేస్తుంది. గతనెల పదో తేదీన జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
|