ప్రకృతి ప్రకోపానికి అల్లకల్లోలమైన చైనాలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం ఈ భూకంప మృతుల సంఖ్య 20 వేలకు దాటినట్టు అంచనా. అయితే చైనా ప్రభుత్వం మృతుల సంఖ్యను అధికారికంగా ధృవీకరించలేక పోతోంది.
భూకంపానికి గురైన ప్రాంతాల్లో శిథిలాలను తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని చైనా పాలకులు భావిస్తున్నారు. గత సోమవారం చైనాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. రిక్టర్‌స్కేలుపై 7.8గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు సిచుయాన్, వెంఛున్ తదితర నగరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
వెంఛున్ ప్రొవియన్స్‌లోని యింగ్‌జియు పట్టణంలోనే మృతులు 7,700 మంది ఉండవచ్చని, మొత్తం మృతులు 12 వేల మందికి పైగా ఉన్నట్టు అధికారిక వార్తా సంస్థ జినుహా ప్రకటించింది. కాగా, సహాయక చర్యల్లో 20 వేల మంది సైనికులు నిమగ్నమైవున్నారు. మరో 30 వేల మంది సైనికులు బాధిత ప్రాంతాలకు బయలుదేరారు. అంతేకాకుండా నావికా దళం కూడా రంగంలోకి దిగింది.
కూలిపోయిన భవనాలు, గృహాల శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. సిఛుయాన్ ప్రాంతంలో కనీసం 18 వేల మంది సజీన సమాధి అయినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రాంతంలోనే 12,012 మంది మృతి చెందగా, మరో 26,206 మంది గాయపడ్డారు. అలాగే.. మింఝు అనే ప్రాంతంలో మూడు వేల మంది మృత్యువాత పడగా, మూడు గ్రామాల్లోని 20 వేల మంది ఆచూకీ తెలియడం లేదు.
|