భారత విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ తమ దేశ పర్యటన సమయంలో తీవ్రవాదంతో పాటు కాశ్మీర్ సమస్యలు కీలకంకానున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. తీవ్రవాదం ఇరు దేశాలకు అత్యంతమాదకరంగా మారిందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మొహ్మద్ సాధిక్ అన్నారు. వచ్చే వారంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరుగనుంది.
ఇందుకోసం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తీవ్రవాదం, కాశ్మీర్, ఇరు దేశాల మధ్య నెలకొన్న సంక్లిష్ట సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు సాగనున్నాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ సమస్య ఒక కొలిక్కి వస్తుందని పాక్ భారీగానే ఆశలు పెట్టుకొని ఉందని ఆయన సాధిక్ అభిప్రాయపడ్డారు. మిత్రదేశమైన భారత్‌తో స్నేహ పూర్వక సంబంధాల పటిష్టత కోసం తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటికే తాము శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా కృషి చేస్తూ.. శాంతి పూర్వక వాతావరణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో కాశ్మీర్ అంశం కూడా ఉందన్నారు. ఇదిలావుండగా ముఖర్జీ, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీలు ఈనెల 21వ తేదీన భేటీ కానున్నారు. దీనికి ముందుగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం ఈనెల 20వ తేదీన జరుగుతుంది.
|