భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్.. ఆతిథ్య దేశానికి వరాలు కురిపించారు. భూటాన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మరింత తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. అలాగే భారత్-భూటాన్‌ల మధ్య రైల్వే లైను నిర్మాణం చేపట్టనున్నట్టు సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా తమ రెండు దేశాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి సాంస్కృతిక, మత, భౌగోళిక అంశాల్లో ప్రత్యేక సంబంధాలను కలిగి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం దిశగా భూటాన్ అడుగులు వేసిన తర్వాత భూటాన్‌లో పర్యటించిన తొలి అంతర్జాతీయ నేత ప్రధాని మన్మోహన్ సింగ్ కావడం గమనార్హం. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు చేరుకున్న ప్రధాని.. ఆ దేశ ప్రధాని జిగ్మే థిన్లే, రాజు జగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్‌లతో సమావేశమయ్యారు.
ఇదిలావుండగా, భూటాన్-భారత్‌ల మధ్య రైల్వే నిర్మాణం చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ చెప్పారు. అలాగే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత పటిష్టమయ్యేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రైల్వే నిర్మాణం కోసం భారత్ ఒక నివేదికను రూపొందించిందని చెప్పారు.
పశ్చిమబెంగాల్‌లోని హషీమరా నుంచి భూటాన్‌లోని ఫుంత్‌షోలింగ్‌ల మధ్య రైల్వే లైను నిర్మాణం చేపడుతామన్నారు. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవి.నరసింహా రావు భూటాన్‌లో పర్యటించారు. ఆయన తర్వాత హిమాలయన్ దేశంలో పర్యటించిన ప్రధాని సింగ్ కావడం గమనార్హం
|