అంతర్జాతీయంగా నెలకొన్న ఆహారధాన్యాల కొరతకు చైనా, భారత్‌లే కారణమంటూ పశ్చిమ దేశాల నేతలు చేసిన ప్రకటనలను బ్రిక్ దేశాల విదేశాంగ మంత్రులు కొట్టి పారేశారు. ఆహార సంక్షోభానికి పలు కారణాలు ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా (బ్రి.ఆర్.ఐ.సి) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రష్యాలో జరుగుతోంది.
ఇందులో ఆహార ధాన్యాల సంక్షోభంపై చర్చించారు. భారత్, చైనా దేశాల్లో మధ్యతరగతి ఆహార వినియోగం ఎక్కువ కావడం వల్లే ఆహార సంక్షోభం తలెత్తిందని అమెరికా వంటి పశ్చిమ దేశాల నేతలు చేసిన వ్యాఖ్యలను బ్రిక్ మంత్రులు కొట్టిపారేశారు. దీనిపై ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. ఆహార సంక్షోభానికి పలు కారణాలు ఉన్నాయన్నారు. వీటిలో ప్రధానంగా బంగ్లాదేశ్, మియన్మార్ దేశాల్లో సంభవించిన తుఫాను కారణమన్నారు. ఈ తుఫాను తాకిడికి ఆయా దేశాల్లోని పంటకు పూర్తిగా నీటిలో కొట్టుకుని పోయిందన్నారు.
దీంతో ఉత్పత్తి లేక బియ్యం ఎగుమతి నిలిచి పోయింది. దీనికి తోడు ఆ దేశాలు బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇలాంటి కారణాల రీత్యా ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందన్నారు. చైనా విదేశాంగ మంత్రి యంగ్ జైచ్చి మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో చైనా దిగుమతి చేసుకుంటున్న ఆహార ధాన్యాలు కేవలం రెండు శాతమే. అయితే తాము పలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు.
బ్రెజిల్ మంత్రి సెల్సో అమోరియం స్పందిస్తూ.. గత 30 సంవత్సరాలుగా బ్రెజిల్ బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలో ఎపుడూ ఆహార సంక్షోభం ఏర్పడలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు రైతులకు కల్పిస్తున్న రాయితీలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిణామం ఉత్పన్నమైనట్టు పేర్కొన్నారు.
|