చైనా సైనిక దళాలు తరచుగా భారత సరిహద్దులను దాటి సిక్కింలో చొరబడుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో, భారత్‌తో తమకున్న సరిహద్దు వివాదం చాలా సున్నితమైన సమస్యగా చైనా పేర్కొంది.
ఏమైనప్పటికీ దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం కారణంగా ఇతర రంగాల్లో తమ మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక సహకారం దెబ్బతినరాదని ఇరు దేశాలూ అంగీకరించిన విషయాన్ని చైనా గుర్తు చేసింది. గతంతో పోలిస్తే చైనా-భారత్ సంబంధాల్లో భారీమార్పులు చోటుచోటు చేసుకున్నాయని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా అంగీకారం కుదిరిందని చైనా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వూ దావై విలేఖరులతో చెప్పారు.
సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకుగాను కలిసి పనిచేయాలని ఇరుపక్షాలూ అంగీకరించాయని, సరిహద్దు కారణంగా ఇతర రంగాల్లో చైనా, భారత్ మధ్య నెలకొన్న వ్యూహాత్మక సహకారం దెబ్బతినకూడదని నిర్ణయించుకున్నాయని వూ పేర్కొన్నారు.
చైనా భూభాగంలోకి భారతీయులు, భారత భూభాగంలోకి చైనీయులు ప్రవేశించి వంటచెరకును సేకరించుకుంటున్నారని, చెట్లను నరికి తీసుకుపోతున్నారని వూ గుర్తు చేశారు. గతంలో ఇలా జరిగితే వెంటనే వారిని అరెస్ట్ చేసేవారని, ఎందుకంటే ఇరువురూ సరిహద్దులను అతిక్రమించి వెళుతున్నారని గతంలో భావించేవారని వూ చెప్పారు.
గతంలో అయితే సరిహద్దుల్లోని ఇరు దేశాల సైనిక దళాలు ఎన్నటికీ పరస్పర సంబంధాల్లోకి వెళ్లేవి కావని చెప్పిన వూ, చైనా-భారత్ సంబంధాల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
|