ఫిలిప్పైన్స్‌పై భీకర టైపూన్ తుఫాన్ దాడి చేసిన ఘటనలో వందలాదిమంది ప్రజలు గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. తుఫాన్ మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుల నౌకలోంచి సోమవారం 38 మంది బతికి తీరాన్ని చేరినప్పటికీ ఫిలిప్పైన్స్‌పై భీకర తుఫాన్ కారణంగా వందలాది మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. కాగా, విరుచుకు పడిన తుపాన్ భీభత్సానికి గురైన ప్రాంతాల్లో సోమవారం సహాయ చర్యలను ముమ్మరం చేశారు.
తుఫాన్ ధాటికి చెలరేగిన వరదముంపులో చిక్కుకున్న మృతుల సంఖ్య 229కి పెరిగిందని ఫిలిప్పైన్స్ అధికారులు ప్రకటించారు. అయితే శనివారం తుఫాన్ బారిన పడ్డ ఫెర్రీ బోటులోని 747 మంది ప్రయాణీకులు, సిబ్బందిలో చాలామంది బోటు నుంచి సముద్ర జలాల్లోకి దుమికిన కారణంగా వారి వివరాలు అగమ్యగోచరంగా మారాయని పోలీసులు తెలిపారు.
మనీలా నుంచి సెబుకు ప్రయాణిస్తున్న 24 వేల టన్నుల బరువైన ఈ ప్యాసింజర్ నౌక సిబుయాన్ ద్వీపానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో తుఫానులో చిక్కుకుందని సిబుయాన్ నగర మేయర్ శాన్ ఫెర్నాండో పేర్కొన్నారు. కాగా బతికి బయటపడ్డ రేనాటో లానోరియా ఈ ప్రమాద ఘటనలోంచి వందమంది ప్రాణాలు కాపాడుకున్నారని మిగిలిన వారు ఇంకా నౌకలోనే చిక్కుకున్నట్లుగా పేర్కొనడం గమనార్హం.
|