పాకిస్థాన్‌లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటుగా ఇతరులపై దాడులకు తాలిబన్ ఉగ్రవాదులు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. తాలిబన్ ఛీఫ్ బైతుల్లా మషూద్ నేతృత్వంలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడతారని పాక్ నిఘా వర్గాలు ముందస్తు సమాచారం అందుకుంది. దీనితో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాలిబన్ ఉగ్రవాద సంస్థ దాదాపు 300 మంది ప్రముఖలపై దాడులకు వ్యూహాలు రచించింది. వీరిలో రాజకీయ పక్షాలైన అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, అవామీ నేషనల్ పార్టీ, ముత్తాహిదా క్వామీ ఉద్యమం, తాలిబన్లకు వ్యతిరేకంగా వ్యవహరించే షియా, సున్నీ మత పెద్దలు ఉన్నారు. పాకిస్థాన్ ప్రావిన్స్‌ల మంత్రులు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రముఖులతో పాటుగా వారి కుటుంబాలకు ఉగ్రవాదులు హాని తలపెట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేశాయి. పాకిస్థాన్ ఇప్పటికీ ప్రమాదం అంచునే ఉందని సీఐడీ ఛీఫ్ సౌదా మీర్జా చెప్పారు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించటానికి నిఘా వర్గాలతో తాము కలిసి పనిచేస్తున్నామని మీర్జా వెల్లడించారు.
కరాచీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అహసాన్ హయత్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న జుందుల్లా తీవ్రవాద బృందాలను అరెస్టుచేసి విచారణ జరపగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చిందని మీర్జా తెలిపారు. గతంలో అమెరికా ప్రతినిధులుగా ముత్తాహిదా క్వామీ ఉద్యమం నేతలు పనిచేశారని వారు వివరించారన్నారు. ప్రస్తుతం వారిపై దాడికి సమాయత్తం అవుతున్నామని ఉగ్రవాద బృందాలు వివరించాయని మీర్జా తెలియజేశారు.
|