టిబెట్ మతగురువు దలైలామా మద్దతు దారులను అణచివేసే దిశగా చైనా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ మేరకు టిబెట్‌లో దలైలామా నడుపుతున్న పాఠశాలలు, ఆశ్రమాలతో చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వాధికారులు, అధికార పార్టీ కార్యకర్తల పిల్లలను రెండు నెలల్లోపు తిరిగి చైనాకు పిలిపించుకోవాలని చైనా ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా ఈ నెల 14వ తేదీన ఇచ్చిన ఈ నోటీసులను బేఖాతరు చేసిన వారిని పదవులనుండి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తామని హెచ్చరించింది. టిబెట్ ప్రాంతంలో పనిచేస్తున్న మాజీ అధికారులు, అధికారులు, పార్టీ కార్యకర్తలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చైనా ప్రాంతీయ పార్టీ, ప్రభుత్వ క్రమశిక్షణ పర్యవేక్షణ కమిషన్ పేర్కొన్నట్లు చైనా దినపత్రిక "చైనా డైలీ" వెల్లడించింది.
బీజింగ్ ఒలింపిక్స్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలంటూ ప్రపంచ దేశాల నుండి చైనా ఒత్తిడిని ఎదుర్కొంది. ఇందుకు గానూ... ఒలింపిక్స్‌కు టిబెట్ నిరసనదారుల నుంచి ఎలాంటి అంతరాయం కలుగనీయకుండా చూడాల్సిందిగా కోరుతూ.. దలైలామాతో రెండు విడతలుగా చైనా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో చైనా ప్రస్తుతం టిబిటెన్ల అణచివేతకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది.
|