ఇరుదేశాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో సమిష్టి సహకారం అవసరమని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ భారత్‌కు పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఫోన్‌ద్వారా ప్రధాని గిలానీ సంభాషించారు.
ఉగ్రవాదుల చర్యల కారణంగా ఇరుదేశాల్లో అశాంతి చోటుచేసుకుందని తెలిపారు. వారి పన్నాగాలకు అడ్డుకట్టే వేసేందుకు సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విజయం సాధించటంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు గిలానీ శుభాకాంక్షలు తెలిపారు.
పొరుగు దేశమైన భారత్‌తో స్నేహ సంబంధాలను శాశ్వితంగా కొనసాగించాలని పాకిస్థాన్ ఆశిస్తుందని వివరించారు. ఇరుదేశాల్లో నెలకొన్న అశాంతి ఈ బంధాన్ని ధృడతరం చేయడంలో విఫలమవుతుందని తెలియజేశారు. ఇరువురికి పొరుగు దేశమైన ఆప్ఘనిస్థాన్‌లో శాంతి విలసిల్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఆప్ఘన్‌లో శాంతి కోసం తాము కూడా సహకరిస్తామని వివరించారు. భారత్-పాకిస్థాన్‌ల వివాదాస్పద ఆంశమైన కాశ్మీర్‌ను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం మేలని తెలిపారు. ఈవిషయంలో భారత్ పూర్తిగా సహకరిస్తుందని గిలానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
|