అవినీతి ఆరోపణలతో కటకటాల పాలైన బంగ్లాదేశ్ మాజీ మంత్రి మొహ్మద్ నసీం శనివారం విడుదలయ్యారు. ఆయన గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునేందుకు గాను ఆయనను బెయిల్‌పై విడుదల చేసినట్టు డీఐజి (జైళ్ళ శాఖ) మేజర్ శంషూల్ హైదర్ సిద్ధిక్యూ తెలిపారు.
మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో షేక్ హసీనాతో సహా.. మరికొంత మంది మాజీ మంత్రులను, సీనియర్ ప్రభుత్వ అధికారులపై బంగ్లాదేశ్ సైనిక ప్రభుత్వం చర్య చేపట్టింది. ఇందులోభాగంగా షేక్ హసీనా, మాజీ హోం మంత్రి నసీం తదితరులను అరెస్టు చేసింది.
ఇలా అరెస్టయిన వారికి బెయిల్ కూడా మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఆనారోగ్యం బారిన పడటంతో ఆమెకు బెయిల్ మంజూరు చేయించి, వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు పంపారు. తాజాగా నసీంకు స్వేచ్ఛా జీవితం కల్పించారు.
గత నాలుగు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న నసీం.. రెండు నెలలుగా సెలెబ్రల్ హీమోర్రేజ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఉన్నత వైద్య సేవల కోసం మాజీ మంత్రిని విడుదల చేసినట్టు జైలుశాఖ డీఐజి వెల్లడించారు.
|