పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భవితవ్యం మరో 48 గంటల్లో తేలనుంది. ఆయనపై వచ్చే సోమవారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు పాక్ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసుకుంది. అభిశంసన తీర్మానానికి ముందుగానే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అధికార సంకీర్ణ ప్రభుత్వ పార్టీలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)లు సూచించాయి.
ఇందుకు ముషారఫ్ ససేమిరా అన్నారు. తాను రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యానని అందువల్ల అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోనని స్పష్టం చేశారు. దీంతో ముషారఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని వచ్చే సోమవారం ఆ దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు పిపిపి, పీఎంఎల్ (ఎన్) పార్టీలు నిర్ణయించాయి. దీనికి తోడు పాక్ సైనికులు సైతం ముషారఫ్‌కు బాసటగా నిలిచేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ఆయన హుందాతనంగా దిగిపోవడమే మంచిదని పలువురు సీనియర్ సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాక్ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. అయితే అభిశంసన తీర్మానాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటానని ముషారఫ్ స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఏక్షణంలోనే ఎంతకైనా తెగించే ముషారఫ్.. అవసరమైతే పార్లమెంట్‌ను సైతం రద్దు చేసేందుకు వెనుకంజ వేయబోరని మరికొందరి వాదన.
|