పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన జీవిత చరమాంకాన్ని సౌదీ ఆరేబియాలో గడుపనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముషారఫ్‌కు ఆశ్రయం ఇచ్చేందుకు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా సమ్మతించినట్టు సమాచారం. రాజు అబ్దుల్లా కుటుంబంతో ముషారఫ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే.. ముషారఫ్ కుటుంబ సభ్యులు అమెరికాలో నివశిస్తున్న విషయం తెల్సిందే.
ముషారఫ్‌పై పాక్ సంకీర్ణ పార్టీలు సోమవారం అభిశంసన ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే. ఈ తీర్మానానికి ముందుగానే గౌరవప్రదంగా తప్పుకోవాలని అధికార పక్షాలు సూచించాయి. అయినప్పటికీ.. ముషారఫ్ మాత్రం తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. ఒకవేళ పాక్ పాలకులకు, ముషారఫ్‌కు మధ్య సంధి కుదిరిన పక్షంలో ముషారఫ్‌కు సౌదీలో ఆశ్రయం పొందేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా.. అమెరికా, బ్రిటన్, టర్కీ దేశాల్లో కూడా ముషారఫ్ ఆశ్రయం పొందేందుకు అవకాశాలున్నాయి. అయినప్పటికీ ముషారఫ్ మాత్రం సౌదీ వైపే మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
1999లో సౌదీ రాజు విజ్ఞప్తి మేరకే నవాజ్ షరీఫ్‌కు ఉరిశిక్ష విధించకుండా సౌదీ పంపించారు. షరీఫ్ సౌదీలో ఉన్నంతకాలం మీడియాతో మాట్లాడకుండా, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా కూడా సౌదీ పాలకుల నుంచి ముషారఫ్ హామీ పొందారు.
తనకు ఇబ్బంది కలిగించే వార్తలు ప్రసారం చేస్తున్నందున దుబాయి కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లను కూడా దుబాయి రాజు ద్వారా ముషారఫ్ మూసివేయించారు. తాజాగా అలాంటి పరిస్థితినే ముషారఫ్‌కు ఎదురుకానుండటం గమనార్హం.
|