పాకిస్థాన్ అధ్యక్ష పీఠాన్ని మహిళ చేపట్టవచ్చని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కో-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్ధారీ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా తన పేరు మీడియాలో రావడాన్ని ఆయన తోసిపుచ్చారు. పాక్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జర్ధారీ ఈ విషయాన్ని వెల్లడించారు.
అంతేకాకుండా.. దేశాధ్యక్ష పదవి నుంచి పర్వేజ్ ముషారఫ్ వైదొలగిన తర్వాత తమ దేశ విదేశాంగ విధానంలో సమూల మార్పులు చేయనున్నారు. అలాగే.. పొరుగు దేశాలతో ఉన్న ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి భారత్, ఆఫ్గనిస్థాన్, ఇరాన్, అరబ్ దేశాల నేతలతో ఒక సదస్సును నిర్వించే యోచనలో ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. అధ్యక్ష పీఠం నుంచి ముషారఫ్ దిగిన తర్వాత ఆ స్థానాన్ని ఒక మహిళ భర్తీ చేస్తుందని చెప్పారు.
అయితే అభ్యర్థిని సంకీర్ణ ప్రభుత్వం ఎంపిక చేస్తుందని వివరించారు. ముషారఫ్ వైదొలగిన తర్వాత కొత్త పాకిస్థాన్‌ను ఆవిష్కరిస్తామన్నారు. ప్రతి అధ్యక్షుడు దేశ పార్లమెంట్‌కు సమాధానం చెప్పితీరాల్సిందేనని జర్ధారీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటే అత్యున్నతమని ఆయన చెప్పుకొచ్చారు. దేశ సైనిక చీఫ్‌ను మార్చాలని తాను కోరగా, అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిరాకరించారని జర్ధారీ తెలిపారు.
|