పాకిస్థాన్ దేశాధ్యక్ష పదవికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కొ-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్ధారీ, పిఎంఎల్ (ఎన్) పార్టీ సీనియర్ నేత సయీద్ ఉజ్ జమాన్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల ఆరో తేదీన జరుగనున్న పాక్ దేశాధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం నామినేషన్ దాఖలు తేదీ మంగళవారంతో ముగిసింది.
ఇదిలావుండగా పాక్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పిపిపి కొ-ఛైర్మన్ జర్ధారీ అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయన స్వయంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు క్షమాణలు చెప్పారు. దేశ హితం కోసం సంకీర్ణ ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా.. అధ్యక్ష పదవికి 52 సంవత్సరాల జర్ధారీ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంఎల్-ఎన్ మద్దతు తనకే ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా పీఎంఎల్-ఎన్ తరపును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సిద్ధిక్యూ, మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సొంత పార్టీ పీఎంఎల్-క్యూ పార్టీకి చెందిన ముషాహిద్ హుస్సేన్ సయ్యద్‌లు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పాక్ అధ్యక్ష ఎన్నికలో ముక్కోణపు పోటీ నెలకొంది.
|