పాకిస్థాన్‌లో బుధవారం జరిగిన బాంబు పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో శివార్లలోని ఒక రెస్టారెంట్‌లో ఈ పేలుడు జరిగిందని పోలీసులు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల పేలుడు సంభవించిందని తొలుత భావించారు. అయితే దీనిపై పోలీసులు లోతుగా పరిశీలించగా, 3.5 కేజీ గ్యాస్ సిలిండర్‌ను పేలుడుకు ఉపయోగించినట్టు పోలీసులు చెప్పారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది కూలీలు, డ్రైవర్లు కావడం గమనార్హం. పేలుడు జరిగిన సమీప ప్రాంతమైన సిహాలా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు వెళ్లి, ప్రమాద పరిస్థితిని అంచనా వేశారు. అలాగే గాయపడిన వారిని సమీపంలోని పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్పీ కమ్రాన్ అడిల్ విలేకరులతో మాట్లాడుతూ పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించినట్టు చెప్పారు.
అయితే రెస్టారెంట్ యజమాని రాజ్ వాలి స్పందిస్తూ.. గ్యాస్ పేలుడు ప్రమాదం జరిగిందని పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు. తాను కిరోసిన్ స్టౌవ్‌ను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. అయితే ఒక చిన్నారి కూర్చొన్న కుర్చీ కింద బ్యాగు పేలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
|