అణు ఇంధన సరఫరాకు సంబంధించి భారత్‌కు మినహాయింపు ఇవ్వడంపై కొన్ని సభ్య దేశాలు ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో అణు సరఫరాదేశాల బృందం వియన్నాలో గురువారం నుంచి కీలక సమావేశం జరుపనుంది. ఆగస్ట్ 21-22 తేదీలలో సమావేశమైనప్పుడు కనీసం 15 సభ్యదేశాలు భారత్ సమర్పించిన ముసాయిదాపై సవరణలు చేయాలని డిమాండ్ చేశాయి.
డిమాండ్లకు అనుగుణంగా గతవారం సవరించిన ముసాయిదాను భారత్ తిరిగి ఎన్ఎస్‌జికి సమర్పించింది. 45 దేశాలకు సభ్యత్వం ఉన్న అణు సరఫరాదారుల బృందం గురువారం నుంచి రెండురోజుల పాటు భారత్ సవరించిన ముసాయిదాపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది.
భారత సవరించిన ముసాయిదాతో కూడా సంతృప్తి పడని న్యూజిలాండ్, ఆస్ట్రియా వంటి దేశాలు, అణు పరీక్షల విషయంలో ఈ సమావేశంలో పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల వ్యాఖ్య. ప్రస్తుతం ఎన్ఎస్‌జికి అధ్యక్షత వహిస్తున్న జర్మనీ.. భారత్ ముసాయిదాను సభ్యదేశాలకు పంపిణీ చేసింది. దీనిని అధ్యయనం చేసిన పై దేశాలు ఈ ముసాయిదా పాఠం మెరుగులు దిద్దిన రూపంలో ఉంది తప్ప ఎలాంటి కొత్త నిబంధనలు దానిలో జోడించబడలేదని భావిస్తున్నాయి.
అయితే ఈ సమావేశం వియన్నాలో ఇంకా ప్రారంభం కాకముందే భారత్‌లో అణుఒప్పందంపై మళ్లీ తీవ్రవాదోపవాదాలు చెలరేగాయి. అణు పరీక్షలు నిర్వహించినట్లయితే భారత్‌కు అణు ఇంధన సరఫరాను నిలిపివేయడం జరుగుతుందంటూ అమెరికా ప్రభుత్వం 9 నెలల క్రితం రూపొందించిన డాక్యుమెంట్ బుధవారం వెలుగులోకి రావడంతో భారత్‌లో గగ్గోలు మొదలైంది.
ఈ నేపథ్యంలో వియన్నాలో జరుగనున్న ఎన్ఎస్‌జి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
|