భవిష్యత్తులో భారత్ అణు పరీక్షలు జరిపినట్లయితే తక్షణం తాము అణు ఇంధన సరఫరాలను ఇతర అణు సహకారాన్ని నిలిపివేస్తామని అమెరికా స్పష్టం చేసింది. అణు సరఫరాదారుల బృందం వియన్నాలో గురువారం సమావేశమవుతుండగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం 9 నెలలక్రితం రూపొందించిన ఓ అధికారిక పత్రం బుధవారం బహిర్గతమైంది.
భారత్-అమెరికా అణు ఒప్పందం యొక్క కీలక నిబంధనలపై మొదటినుంచి భారత ప్రభుత్వం తనదైన వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ఒప్పందం అసలు రూపం 9 నెలల తర్వాత ఇప్పుడు బయటపడటంతో భారత్‌లో గగ్గోలు బయలు దేరింది. అణు ఇంధన సరఫరా దేశాలతో అణు వాణిజ్యం జరుపడంలో భారత్‌కు కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకోసం ఎన్ఎస్‌జి దేశాలు వియన్నాలో గురువారం సమావేశమవుతుండటం తెలిసిన విషయమే.
భారత్-అమెరికా మధ్య కుదిరిన 123 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం చూస్తే భారత్ అణు పరీక్షలు జరిపినట్లయితే కొన్ని రంగాల్లో అణు సహకారం నిలిపివేస్తామని అమెరికా చెప్పినట్లుగా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ ఇతర దేశాలనుంచి అణు ఇంధన సరఫరాను భారత్ నిరంతరాయంగా అందుకునేలా చేస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లుగా ఇంతవరకు ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఈ తరహా ప్రచారాన్ని తిప్పికొడుతూ, మొదటినుంచి ఈ రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ హోవార్డ్ బెర్మన్ బుధవారం 26 పుటల అమెరికా ప్రభుత్వ పత్రాన్ని విడుదల చేశారు. భారత్ అణు పరీక్షలను నిర్వహించిన పక్షంలోనూ ఆ దేశానికి తాము అణు ఇంధన సరఫరాకు హామీ ఇవ్వబోవడం లేదని ఈ పత్రంలో అమెరికా ప్రభుత్వం 9 నెలల క్రితమే స్పష్టం చేయడం గమనార్హం.
గత సంవత్సరం అక్టోబర్‌లో తనకంటే ముందు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన టామ్ లేంటోస్ సంధించిన 45 ప్రశ్నలకు అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ సమాధానం పంపింది. 26 పుటల పరిమాణంలో ఉన్న ఈ పత్రాన్ని ఈ జనవరి 16న అమెరికా ప్రభుత్వం టామ్‌కు అందిస్తూ చేసిన వినతి ప్రకారం ఇంతకాలంగా దాన్ని బహిర్గతం చేయకుండా తొక్కి ఉంచారు.
అణుఒప్పందం విషయంలో అమెరికా వైఖరిలో మార్మికత్వం ఉందని అసలు నిజాలు బయటపడటం లేదని భారత్‌లో తొలినుంచి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో అమెరికా ప్రభుత్వ పత్రం బహిర్గతం కావడంతో మన్మోహన్ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోంటోంది.
|