పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగనున్నాయి. పర్వేజ్ ముషారఫ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అధికార సంకీర్ణ కూటమి నుంచి మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ బయటికొచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
దేశాధ్యక్ష ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ.. విజయావకాశాలు మాత్రం మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కొ-ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్దారికే మెరుగ్గా ఉన్నాయి. పాక్ పార్లమెంటులోని ఉభయ సభలైన జాతీయ అసెంబ్లీ, సెనేట్ సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.
జర్దారికి ఎంక్యూఎం, అవామీ నేషనల్ పార్టీ, జేయూఐ వంటి చిన్న పార్టీల మద్దతు ప్రకటించాయి. దీంతో జర్దారి 60 శాతం ఓట్లకు పైగా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన జర్దారి కొన్ని కీలక హామీలను గుప్పించారు. అవి మిగిలిన ప్రతిపక్ష పార్టీలను సైతం ఆకర్షించేలా ఉన్నాయి. దీంతో ఆయన విజయావకాశాలు మరింత మెరుగుపడినట్టు పిపిపి వర్గాల పేర్కొంటున్నాయి.
|