భారత్‌కు అణు మినహాయింపుపై రెండు రోజులుగా వియన్నాలో జరుగుతున్న 45 దేశాల అణు సరఫరా బృంద దేశాల చర్చలు ఫలవంతం కాకపోవడంతో శనివారం తాజాగా మరోసారి సమావేశం కానున్నారు. అణు ఇంధన సరఫరాకు సంబంధించి భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చేవిషయంలో భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్న 6 దేశాల బృందంలో చైనా కూడా చేరడంతో ఎన్ఎస్‌జి దేశాల మధ్య తాజా సమావేశం అనివార్యమైంది.
పౌర అణు ఒప్పందానికి సంబంధించి భారత్ సవరించిన ముసాయిదాపై దౌత్యవేత్తలు తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో భారత్‌కు అణు ఇంధన సరఫరా విషయంలో ప్రత్యేక మినహాయింపు సాధించి పెట్టేందుకు అమెరికా శుక్రవారం రాత్రి ఎన్‌ఎస్‌జి సభ్యదేశాలతో చర్చలు ముమ్మరం చేసింది.
ఏ దేశానికైనా అణు ఇంధనం సరఫరా చేయడానికి సంబంధించి ఎన్‌ఎస్‌జి నిబంధనల నుంచి భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చే విషయంలో రూపొందించిన ముసాయిదాలో కఠినతర ఆంక్షలు చేర్చాలని ఆస్ట్రియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలు పట్టుబడుతున్నాయి. ప్రత్యేకించి అణు పరీక్షల విషయంలో ఈ దేశాలు ఎన్ఎస్‌జి సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తాయి.
అయితే భారత్‌కు మినహాయింపు ఇవ్వడానికి పలు దేశాలు తమ ఆమోదం తెలిపాయని దౌత్యవర్గాల సమాచారం. కానీ, 45 దేశాలకు సభ్యత్వమున్న ఈ బృందంలో ఏ ఒక్క దేశమైనా సరే నిర్ణయాన్ని నిలపివేసే హక్కు కలిగి ఉండటమే భారత్‌కు చిక్కులు తెస్తోంది. ఇప్పటికే ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలను ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతూ భారత్, అమెరికా అధికారుల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ వర్గాలు తెలిపాయి.
కాగా భారత్‌కు అణు సరఫరా విషయంలో మినహాయింపుకు సంబంధించి ఇంకా చేయవలసింది ఉందని ఆస్ట్రియా సూచించింది. కాగా, ఈ అంశంలో గణనీయ పురోగతి జరిగిందని, మినహాయింపును పొందడంపై తాము ఆశాభావంతో ఉన్నామని అమెరికా అధికారులు తెలిపారు.
కాగా, భారత్‌కు మినహాయింపు ఇచ్చేవిషయంలో రెండో రోజైన శుక్రవారం అయిదు సార్లు ఎన్‌ఎస్‌జి దేశాలు తీవ్రంగా చర్చించాయి. శనివారం తాజాగా జరుగనున్న సమావేశంలో ఈ విషయం ఓ కొలిక్కి వస్తాయని భారత్ అధికారులు ఆశిస్తున్నారు.
|