పాకిస్తాన్‌లో శనివారం జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పాలక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత అసిఫ్ ఆలీ జర్దారీ మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు, దేశంలోని నాలుగు ప్రాదేశిక శాసన సభల సభ్యులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జర్దారీ అత్యధిక ఓట్లు సాధించారు. ఈ ఎన్నికతో పాక్ 11వ దేశాధ్యక్షుడిగా జర్దారీ చరిత్రలో నమోదయ్యారు.
పాలక సంకీర్ణ కూటమిలోంచి గత నెలలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎమ్ఎల్-ఎన్ వైదొలిగినప్పటికీ పలు చిన్నపార్టీలు మరియు స్వతంత్ర శాసన సభ్యులు పిపిపికి దన్నుగా నిలిచినందున జర్దారీ గెలుపు సుసాధ్యమయింది.
దేశ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి క్వాజీ ముహమ్మద్ ఫరూక్ పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన పోలింగ్‌ను పర్యవేక్షించారు. నాలుగు ప్రాదేశిక అసెంబ్లీ -పంజాబ్, సింథ్, వాయవ్య సరిహద్దు ప్రాతం, బలూచిస్తాన్- లలో పోలింగ్ ఏకకాలంలో జరిగింది. కాగా, ఈ ఎన్నికల్లో పిపిపి కో ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్దారీకే అవకాశాలు ఉన్నాయని ముందునుంచి భావిస్తూ వచ్చారు.
పిపిపి కో చైర్మన్ జర్దారీ, పాకిస్తాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీకి చెందిన సయీద్ అజ్ జమాన్ సిద్ధికి, మాజీ ప్రధాన న్యాయమూర్తి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్వాయిద్ పార్టీ అభ్యర్థి ముషాహిద్ హుస్సేన్‌లు ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీ ఘనవిజయం సాధిస్తారని, సైనిక, ఆర్థిక రంగాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని పలువురు భావిస్తున్నారు. గత అక్టోబర్‌లో పర్వేజ్ ముషారఫ్ అప్పటి పార్లమెంట్, ప్రాదేశిక అసెంబ్లీల ద్వారా మరో 5 సంవత్సరాల పాటు దేశాధ్యక్ష పదవికి ఎంపికయిన విషయం తెలిసిందే. కాని ముషారఫ్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని విమర్శకులు వ్యాఖ్యానించారు.
సాంప్రదాయకంగా పాకిస్తాన్ అధ్యక్షపదవి లాంఛనప్రాయమైందే కానీ ముషారఫ్ హయాంతో సహా పలు సందర్భాల్లో దేశాధ్యక్షుడికి రాజ్యాంగం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ వచ్చింది.
|