పాకిస్థాన్ దేశ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కొ-ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జర్దారీ దేశాధ్యక్షుడుగా ఎన్నికైనట్టు ఆ దేశ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
అయితే ఆ పార్టీ అధ్యక్షుడు, జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారంపై ఉండవచ్చునని పార్టీకి చెందిన మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలావుండగా.. జర్దారీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ దేశ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ తన లండన్ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.
అలాగే ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కూడా హాజరుకావచ్చునని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. జర్దారీ చేత పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఈనెల ఆరో తేదీన జరిగిన పాక్ అధ్యక్ష ఎన్నికల్లో అసిఫ్ ఆలీ జర్దారీ భారీ మెజారిటీతో ప్రత్యర్థులను మట్టికరపించి విజయం సాధించిన విషయం తెల్సిందే.
|