ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > అంతర్జాతీయ > మన్మోహన్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మన్మోహన్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ!
మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి యంగ్ జియచీ... ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో సోమవారం భేటీ కానున్నారు. అలాగే భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరుగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

వియన్నాలో జరిగిన ఎన్‌ఎస్‌జీ సమావేశంలో అణువాణిజ్యం అంశంలో భారత్‌కు బీజింగ్ మద్దతు తెలుపని విషయం విదితమే. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగనున్న చర్చల్లో భారత్‌ను బుజ్జగించే ప్రయత్నాలకు చైనా పూనుకోవచ్చని విశ్లేషకుల అంచనా.

ఎన్‌ఎస్‌జి దేశాల నుంచి భారత్‌కు అణు వాణిజ్యంలో మినహాయింపు ఇవ్వడంలో వియన్నాలో జరిగిన చర్చల ప్రారంభంలో ఆసక్తి చూపని చైనా తర్వాత భారత్‌కు మినహాయింపు ఇవ్వకుండా నిరోధించడంలో క్రియాశీల పాత్ర వహించడం పలువురిని నివ్వెరపర్చింది.

చైనా అధ్యక్షుడు హు జింటావో మరియు ప్రధాని వెన్ జిబావో... అణు ఒప్పందం విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని మన్మోహన్‌కు హామీ ఇచ్చిన తర్వాత కూడా వియన్నా సమావేశంలో చైనా అందుకు విరుద్ధంగా వ్యవహరించి.. భారత్‌ను ఆశ్చర్యపరిచింది.

ఇక మూడు రోజుల పర్యటనకు వస్తున్న యంగ్ గౌరవార్థం ప్రణబ్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. యంగ్ కోల్‌కతాలో అడుగిడిన వెంటనే చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో భారత్, చైనాల పరస్పర సహకారానికి.. స్నేహానికి ఈ కార్యాలయ ప్రారంభం బలం చేకూరుస్తుందని భావిస్తున్నట్లు యంగ్ వ్యాఖ్యానించారు.

దీంతో భారత్‌తో చైనా భవిష్యత్తులో స్నేహ సంబంధాలను పెంపొందించుకుని తద్వారా ముందుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనబడుతోంది. ప్రణబ్ ముఖర్జీ తనకు మంచి స్నేహితులని... రేపు జరగబోయే సమావేశంలో చర్చలు సఫలీకృతం కావాలనుకుంటున్నట్లు యంగ్ తెలిపారు.
మరిన్ని
దేశాధ్యక్షుడిగా జర్దారీ నేడు ప్రమాణ స్వీకారం
'అణు' ఏకాకితనం నుంచి బయటపడిన భారత్
జర్దారీ ఎన్నికపై ప్రపంచ నేతల హర్షం
భారత్‌కు అణు మినహాయింపు: ఎన్ఎస్‌జీ ఆమోదం
పాక్ అధ్యక్ష ఎన్నికల్లో జర్దారీ గెలుపు
పెషావర్‌లో బాంబు పేలుడు: 12 మంది మృతి