అణు వాణిజ్యంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చే విషయంలో వియన్నాలో 45 దేశాల అణు సరఫరా దేశాల బృందం ఏకగ్రీవంగా అనుమతించడాన్ని అమెరికా విదేశాంగ మంత్రి కాండోలీనా రైస్ కొనియాడారు. ఈ చర్య అమెరికా-భారత్ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేకించి ఎన్‌ఎస్‌జి దేశాల నుంచి అణు ఇంధన వాణిజ్య మినహాయింపు పొందడంలో భారత ప్రభుత్వం నిర్వహించిన పాత్రను రైజ్ ప్రశంసించారు. వియన్నాలో భారత్ తన నాయకత్వ కౌశలాలను సమర్థవంతంగా ప్రదర్శించిందని రైస్ పేర్కొన్నారు.
తమ తమ భయాలు, ఆందోళనలతో ఒక్కొక్క దేశం ఒక్కొక్క తీరుగా వ్యవహరించిన వియన్నా సమావేశంలో అంతరాలను తగ్గించేందుకు భారత్ తీవ్రంగా కృషిచేసిందని రైస్ వ్యాఖ్యానించారు.
భారత్‌కు ప్రత్యేక మినహాయింపునిస్తూ ఎన్ఎస్‌జి దేశాల చర్చలు ఫలవంతంగా ముగిసిన తీరుపట్ల తనకు చాలా సంతోషంగా ఉందని, రైస్ పేర్కొన్నారు. ఇది పెద్ద ముందంజ అని, ఈవిషయంలో భారత్ తన నాయకత్వ శైలిని చక్కగా ప్రదర్శించిందని రైస్ ప్రశంసించారు.
ఈ కాంగ్రెస్ సమావేశంలోనే పౌర అణు ఒప్పందానికి ఆమోదం లభించినట్లయితే ఇంకా మంచిదని, ఏ కారణం వల్ల అయినా ఈ కాంగ్రెస్‌లో ఇది ఆమోదం పొందకపోతే అమెరికా కంపెనీలను భారత్ నిరాశపర్చనవసరం లేదని రైస్ వ్యాఖ్యానించారు.
|