పైలట్ రహిత అమెరికా యుద్ధ విమానం జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు మహిళలతో పాటుగా ఆరుగురు పాకిస్తాన్ పౌరులు మరణించగా మరో 20 మంది గాయపడ్డారని పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌లోని కల్లోల ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో ఉంటున్న తాలిబాన్ కీలక కమాండర్ జలాలుద్దీన్ హఖానీకి చెందినట్లుగా భావిస్తున్న ఇంటిపై అమెరికా యుద్ధవిమానం సోమవారం క్షిపణి దాడులకు దిగింది.
రిమోట్ కంట్రోల్‌చే నియంత్రించబడే పైలట్ రహిత యుద్ధ విమానాన్ని ఆప్ఘనిస్తాన్‌లోని అమెరికా ఆధ్వర్యంలోని నాటో సంకీర్ణ బలగాలు సోమవారం ప్రయోగించాయని స్థానిక ప్రజలు తెలిపారు. ఉత్తర వజీరిస్తాన్ హెడ్‌క్వార్టర్స్ అయిన మిరాన్‌షాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే టండా దార్పఖేల్ వద్ద ఉన్న మత పాఠశాలపై ఈ యుద్ధవిమానం ఆరు నుంచి 7 వరకు గైడెడ్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.
సీనియర్ తాలిబాన్ నేత జలాలుద్దీన్ హక్కాని నిర్వహించే మదరసాపై నాలుగు క్షిపణులు పేలగా, సమీపంలోని ఇళ్లపై మరో మూడు క్షిపణులు పేలాయని అధికారులు చెప్పారు. ఈ మదరసాలో ముగ్గురు బాలికలు ముగ్గురు కూలీలు చనిపోయారని అధికారులు చెప్పగా మృతులలో ముగ్గురు మిలిటెంట్లు ఉన్నారని ఇతర వర్గాలు తెలిపాయి.
తాలిబాన్ అధినేత ముల్లా ఒమర్ ముఖ్య సహచరుడైన హఖాని ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్నదీ లేనిదీ తెలియరావటం లేదు. 2001లో తాలిబాన్ పట్టులోంచి కాబూల్ చేజారిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్త్ ప్రాంతానికి చెందిన పుస్తూన్ నేత ముల్లా ఒమర్ కనిపించడం లేదన్నది తెలిసిన విషయమే.
దాడి జరిగిన అనంతరం మదరసాను చుట్టుముట్టిన తాలిబాన్ యోధులు ఆ ప్రాంతానికి ఇతరులు ఎవ్వరినీ అనుమతించలేదు. మెసూద్ ఆధ్వర్యంలోని పాక్ తాలిబాన్‌లకు ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతాలు పెట్టని కోటలుగా ఉన్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఆప్ఘనిస్తాన్ భూభాగం నుంచి నాటో సంకీర్ణ బలగాలు పైలట్ రహిత యుద్ధవిమానాలతో పాక్ గిరిజన ప్రాంతాలపై దాడులను పెంచుతుండటం గమనార్హం. ఈ దాడుల్లో వారం లోపే 40 మందికి పైగా పాక్ ప్రజలు మరణించారు.
|