అంతరిక్షంలో 68 గంటలపాటు గడిపిన ముగ్గురు చైనా వ్యోమగాములు భూమికి సురక్షితంగా దిగివచ్చారు. చైనాకు చెందిన షెంజౌ-7 వ్యోమనౌకలో మూడు రోజుల క్రితం రోదసీలోకి దూసుకెళ్లిన చైనా వ్యోమగాములు ఝాయ్ ఝిగాంగ్, ల్యూ బామింగ్, జింగ్ హాయ్ షెంగ్‌లు తమ రోదసీ యాత్రను ముగించుకుని మంగోలియాలోని గడ్డినేలలో సురక్షితంగా దిగారు. ఈ యాత్రలో భాగంగా అంతరిక్షంలో నడిచిన తొలి చైనా దేశీయుడిగా ఝాయ్ ఝిగాంగ్ చరిత్ర సృష్టించారు.
షెంజౌ వ్యోమనౌక నుంచి భూమ్మీద తిరిగి క్షేమంగా అడుగుపెట్టిన ఝిగాంగ్ ఈ యాత్ర లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయని చెప్పారు. అద్భుతమైన ఈ యాత్రలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, అయినప్పటికీ తమ రోదసీ యాత్ర విజయవంతమైందనీ పేర్కొన్నారు.
కాగా, అంతరిక్షయాత్రను దిగ్విజయంగా ముగించుకుని వచ్చిన చైనా వ్యోమగాములను చైనా ప్రధాని వెన్ జియాబావో అభినందనలతో ముంచెత్తారు. బీజింగలోని గ్రౌండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ల్యాండింగ్‌ను వీక్షించారు. ఇది చైనా అంతరిక్ష, సాంకేతిక రంగం సాధించిన విజయమని పేర్కొన్నారు. ఈ విజయాన్ని చైనా చిరకాలం గుర్తుంచుకుంటుందని చెప్పారు.
|