భారత్, జపాన్ దేశాలు బుధవారం చారిత్రాత్మకమైన భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన సందర్భంగా ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ప్రతిన చేశాయి.జపాన్ పెట్టుబడుదారులకు భారత్‌లో ఆకాశమే సరిహద్దు అని చెప్పిన ప్రధాని మన్మోహన్ జపాన్ మదుపుదార్లను విశేషంగా ఆకర్షించారు. మరోవైపు ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మన్మోహన్, జపాన్ ప్రధాని తారో అసోలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఇరుదేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత మెరుగు పర్చుకుంటామని చెప్పారు. ఆసియా, ప్రపంచ పరిణామాలపై తమ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ప్రాతిపదికపైనే తమ సంబంధాలు ఆధారపడి ఉన్నాయని ఇరు దేశాల నేతలూ చెప్పారు. అయితే తమ రెండు దేశాల మధ్య కుదిరిన ఆర్థిక భాగస్వామ్యం, భద్రతా సహకారం అనేవి ఏ ఇతర దేశానికి వ్యతిరేకంగా కుదుర్చుకున్నవి కాదని మన్మోహన్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి చైనాతో సహా ఏ మూడవ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తామీ ఒప్పందం కుదుర్చుకోలేదని సింగ్ నొక్కి చెప్పారు. ప్రపంచ ఇంధన డిమాండ్ పెరగుతున్న నేఫథ్యంలో అణు శక్తి అనేది స్వావలంబన మరియు కాలుష్యరహిత వనరుగా కీలకపాత్ర పోషించనుందని ఇరు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. అయితే భారత్‌కు అణు ఇంధన సరఫరా కూటమి ప్రత్యేక మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆ దేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకునే విషయమై జపాన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |