అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఏర్పడిన నూతన నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా నూతన ఆశలను మొలకెత్తిస్తోంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన బారక్ ఒబామా వ్యక్తిత్వం అమెరికా ప్రజలనే కాక, ప్రపంచ నేతలపై కూడా ప్రభావం వేస్తోంది. ఇరాన్, ఉత్తర కొరియా, సూడాన్ తదితర అమెరికా శత్రుదేశాల ప్రజల మనోభావాలు కూడా ఒబామా పట్ల సానుకూలంగా మారుతుండటం గమనార్హం.ఇన్నాళ్లుగా అమెరికాను బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న దేశాల నేతలు సైతం ఒబామాను అభినందించడానికి దశాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయాలను సైతం పక్కన పెడుతున్నారంటే ఒబామా వ్యక్తిత్వ ఘనత అర్థమవుతుంది.అమెరికా కోరుకుంటున్న మార్పు వచ్చేసిందంటూ ఒబామా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత చికాగోలో చేసిన ప్రసంగం అసాధారణం, అనూహ్యం అని ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మద్‌నెజాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 29 ఏళ్లుగా అమెరికాపై పెంచుకున్న సాంప్రదాయిక వ్యతిరేకతను సైతం తోసి రాజన్న ఇరాన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామాకు అభినందనలు తెలియజేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం చెలరేగిన తర్వాత్ అమెరికా నూతన అధ్యక్షుడికి ఒక ఇరాన్ నేత అభినందనలు తెలియజేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాలు మౌలికంగా, న్యాయబద్ధంగా మారవలసిన అవసరముందని అహ్మద్ కాంక్షించారు.అమెరికా ఎన్నికల్లో అత్యధిక ఓట్లను సాధించినందుకు గాను మీకు ఇవే నా అభినందనలని అహ్మద్ పేర్కొన్నారు. నిజమైన ప్రజా ప్రయోజనాలను మీరు పట్టించుకుంటారని, స్వార్థపూరితమైన ఒక చిన్న మైనారిటీ వర్గం యొక్క అంతంలేని డిమాండ్లను పక్కన బెడతారని ఆశిస్తున్నట్లుగా అహ్మద్ పేర్కొన్నారు. దేశీయ రంగంలో మౌలిక మార్పులను అమెరికా ప్రజలు కోరుకుంటున్న స్థాయిని ఒబామా విజయం ప్రపంచానికి తేటతెల్లం చేసిందని ఇరాన్ అధికారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ఇకపోతే ప్రపంచం మొత్తం మీద అమెరికా అంటే పచ్చి ద్వేషభావాన్ని ప్రకటించే అరబ్ ప్రపంచంలోనూ ఒబామా మధ్యప్రాచ్యం పట్ల నూతన వైఖరిని అవలంబిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒబామా రంగు వల్ల కావచ్చు, అతడి ముస్లిం కుటుంబ నేపథ్యం కావచ్చు, లైదా అతని ఆకర్షణ ప్రభావం కావచ్చు.. అనేకమంది అరబ్‌లకు ఒబామా కొంత భిన్నంగా కనిపించడం విశేషం. బీరూట్, సూడాన్ తదితర బద్ధ వ్యతిరేక దేశాలు సైతం ఒబామా గెలుపుతో మెరుగైన భవిష్యత్తుపై అశ కలుగుతోందని వ్యాఖ్యానించాయి.చివరకు ఉత్తర కొరియా అణు చర్చల ప్రతినిధి రి గున్ సైతం బారక్ ఒబామా ఆధ్వర్యంలో ఏర్పడే అమెరికా కొత్త పాలనాయంత్రాంగంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొనడం గమనార్హం. ఒబామా సైతం బుష్ కఠిన విధానాలకు దూరంగా ఉత్తర కొరియాతో ప్రత్యక్ష చర్చలు చేపడతానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |