శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ రాజకీయ రాజధానిని కైవసం చేసుకున్న తర్వాత గత రెండు రోజులుగా కొలంబో వరుసగా బాంబుదాడులకు గురవుతోంది. శనివారం కొలంబోలోని వాణిజ్య ప్రాంతమైన పెటాలో జరిగిన బాంబు పేలుళ్లలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండురోజుల వ్యవధిలోపే కొలంబోలో రెండోసారి బాంబుదాడులు జరగడం విశేషం.రాజధానీ నగరంలోని మసీదులో నిలిపి ఉంచిన వ్యాన్‌లో పేలుడు జరిగిందని లంక సైనిక ప్రతినిధి తెలిపారు. టైగర్ల రాజధాని కిలినోచ్చిని కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయం సాధించిన లంక సైన్యం ప్రస్తుతం ఎల్టీటీఈని తుదముట్టించే లక్ష్యంతో ముల్లైతీవుపై భారీ స్థాయిలో బాంబుదాడులు కొనసాగిస్తోంది. ఎల్టీటీఈ కీలక కార్యకర్తలు ఇక్కడ దాగి ఉన్నారని లంకసైన్యం అనుమానిస్తోంది. అరుదైన విజయంతో పొంగి పొర్లుతున్న లంక సైన్యం 54 ఏళ్ల ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్‌ను సజీవంగా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ముల్లైతీవు ఉత్తరాన 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రస్తుతం దిగ్బంధించబడి ఉందని ఆర్మీ ఛీఫ్ శరత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఓ బంకర్‌లో దాగి ఉన్న ప్రభాకరన్‌ను సజీవంగా పట్టుకోవాలని లంకసైన్యం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2006లో కొలంబోలోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఎల్టీటీఈ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన లంక సైనిక ఛీప్ పెను గాయాలకు గాను విదేశాల్లో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. లంక సైన్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్ ఫోర్స్-2ను గత సంవత్సరం ముల్లైతీవులోని సీ టైగర్ల ప్రధాన కార్యాలయంపై దాడిలో మునిగి ఉన్న దళాలకు అదనంగా జోడించారు. ఇక్కడ భూగర్భంలో 30 అడుగుల లోతులో నిర్మించిన ఎయిర్ కండిషనర్ సౌకర్యం కలిగిన బంకర్ల సముదాయంలో ప్రభాకరన్ నివసిస్తున్నట్లుగా లంక పత్రిక తెలిపింది. |