వారంరోజులుగా వైమానిక దాడులతో సరిపెట్టిన ఇజ్రాయెల్ సోమవారంనుంచి గాజాలో భూతల దాడులు ప్రారంభించింది. వేలాది ఇజ్రాయెల్ సైనికులు టాంకులు, సాయుధ బలగాలు, వైమానిక దాడులతో హమాస్ బలగాలపై సోమవారం విరుచుకుపడ్డారని గాజాలోని మీడియా వర్గాలు తెలిపాయి. ఇంతవరకు ఇజ్రాయెల్ దాడుల్లో 510మంది హమాస్ కార్యకర్తలు, ప్రజలు మరణించారని సమాచారం. వరుసగా రెండోరోజు కూడా రాత్రిపూట పోరాటం కొనసాగుతున్నందువల్ల గాజా నగరం నుంచి పలు కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నాయి. లెబనాన్‌పై 2006లో దాడుల తర్వాత గాజాలో అత్యంత పెద్ద సైనిక చర్యకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడి బేఖాతరు చేయకుండా దాడులను తీవ్రతరం చేసింది.శనివారం నుంచి భూతల దాడులు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు 70 మంది పాలస్తీనా ప్రజలు మరణించారని గాజా మీడియా తెలిపింది. గాజా నగరాన్ని పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వేరు చేశాయని, దీంతో దక్షిణ ప్రాంతంనుంచి ఆయుధాలు, సరఫరాలు, సాయుధులు ప్రవేశించకుండా ఇజ్రాయెల్ అడ్డుకుందని చెప్పారు.డిసెంబర్ 27న గాజాలో ఇజ్రాయెల్ తలపెట్టిన దాడిలో 87 మంది పిల్లలతో సహా 512 మంది మృతి చెందారని అత్యవసర సర్వీసుల సిబ్బంది చెప్పారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణను నిలిపివేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన ప్రయత్నాలను అమెరికా అడ్డుకుని ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలబడటంతో మండలి చర్యలు విఫలమయ్యాయి. |