ముంబైలో ఉగ్రవాదుల దాడులకు పాల్పడిన వారు పాక్ దేశీయులే అని తెలిపే సాక్ష్యాధారాలను భారత్ సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి అందించింది. దాడుల్లో పాక్ పాత్రకు సంబంధించిన ఆధారాలను తాము చూపించినందున పాక్ వీటికి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో తమ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని భారత్ కోరింది.పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిన భారత విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముంబై దాడుల సూత్రధారులు పాక్ భూభాగానికి చెందిన వారే అని చూపించే వివరాలను ప్రపంచంలోని పలు దేశాల విదేశీ మంత్రులకు పంపించామని విలేకరులతో చెప్పారు. నవంబర్ 26న ముంబైపై ఘాతుక దాడులు ప్రారంభించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ భూభాగంతో సంబంధాలు ఉన్నాయని చెప్పే సాక్ష్యాధారాలను సోమవారం పాక్ ప్రభుత్వానికి తాము అందజేశామని ప్రణబ్ తెలిపారు. భారత విదేశీ కార్యదర్శి శివశంకర్ మీనన్ సోమవారం ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ షాహిద్ మాలిక్‌ను పిలిచి ముంబై దాడులకు పాక్ భూభాగంతో సంబంధముందని నిరూపించే సాక్ష్యాధారాలను అందించారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ ముంబై దాడులు క్షమించరాని నేరచర్యగా పేర్కొన్నారు. సాక్ష్యాన్ని పరిశీలించి పాక్ తన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలని ప్రణబ్ సూచించారు. |