శ్రీలంక సైనిక దళాలకు తమిళ టైగర్ల అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా పట్టుబడిన పక్షంలో అతడిని భారత్‌కు అప్పగించే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. టైగర్ల చివరి కంచుకోట అయిన ముల్లైతీవు జిల్లాను చుట్టుముట్టిన లంక సైన్యం, ఎల్టీటీఈ ఛీఫ్ ప్రభాకరన్‌ను పట్టి బంధించాలనే కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది.ప్రభాకరన్ తరలింపు విషయమై భారత్ నిజంగా కోరుకుంటున్నట్లయితే తమ ప్రభుత్వం ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తుందని శ్రీలంక రక్షణ మంత్రి ప్రతినిధి రాంబుక్ వెల్లా చెప్పారు. అయితే ఈ విషయమై పొరుగు దేశాలతో తమ అంతర్జాతీయ, దౌత్య సంబంధాలకు అనుగుణంగానే అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జెనీవా కన్వెన్షన్ వంటి అంతర్జాతీయ విధి విధానాలు, ఇతర దేశాలతో తమ దౌత్య సంబంధాలపై ప్రభాకరన్ భవిష్యత్తు ఆధారపడి ఉటుందని లంక మంత్రి ప్రతినిధి చెప్పారు. ఇది దౌత్యవ్యవహారం అయినందుకన ఆ మార్గంలో మాత్రమే ఈ అంశంతో తాము వ్యవహరించగలమని తెలిపారు.సైనిక చర్యలో ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ పట్టుబడిన పక్షంలో అతడిని భారత్‌కు అప్పగించవలసిందిగా భారతీయ పాలక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వీరప్ప మొయిలీ కోరిన నేపధ్యంలో శ్రీలంక దీనిపై స్పందించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ హస్తం గురించి విచారించవలసిందని భారత్ పేర్కొంది. |