రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు అమలు చేసిన వ్యూహాలకు ఎల్టీటీఈ పోరాట వ్యూహాలు సరిపోలుతున్నాయా...! అవునని సమాధానం చెప్పేందుకు కిలినోచ్చి పట్టణంలోని లోతైన బంకర్లు సాక్ష్యంగా ఉంటున్నాయని లంక సైన్యం చెబుతోంది మరి.
తమిళ టైగర్లు వెనుకడుగు వేయడంతో ఎట్టకేలకు కిలినోచ్చి పట్టణంలో ప్రవేశించిన లంక బలగాలు పట్టణంలో బూబీ ట్రాప్‌లను, మందుపాతరలను, పేలుడు పదార్ధాలను తొలగిస్తున్నప్పడు పట్టణంలో అడుగడుగునా కనిపించిన దుర్భేద్యమైన కందకాలను చూసి నివ్వెరపోయారు.
కిలినోచ్చిలో కీలకమైన అన్ని ప్రభుత్వ భవనాల వెలుపల ఛేదించడానికి వీల్లేని పటిష్టమైన బంకర్లను తమిళ టైగర్లు నిర్మించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మాదిరిగా కాకుండా ఎల్టీటీఈ బంకర్లలో మానవ నిర్మిత ఫలకాల గోడల వెనుక ప్రాంతంలో బురద, సిమెంటును నిలిపి ఉంచటం గమనార్హం. శతఘ్ని తూటాలకు, విమానాల ద్వారా ప్రయోగించే బాంబుదాడులకు తట్టుకుని నిలిచేలా ఈ బంకర్లను టైగర్లు శత్రుదుర్భేద్యంగా నిర్మించారు.
టేకు కలపతో రూపొందించిన ఈ బంకర్లకు ఆధునిక విద్యుత్ సౌకర్యం ఉండటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం కూడా కల్పించారని లంక సైన్యం కనుగొంది. ఇలాంటి ఆధునిక బంకర్లు టైగర్ల మాజీ పాలనా నగరంలో అంసఖ్యాకంగా ఉన్నాయని సైన్యం చెప్పింది.
ఎల్టీటీఈ ఉన్నత నాయకత్వాన్ని కాపాడే ఉద్దేశంతోటే ఈ మిలటరీ బంకర్లను పాక్షికంగా లేదా పూర్తిగా భూగర్భంలోనే నిర్మించారని, ఇవి సాదాసీదాగా కాకుండా సుసంపన్నంగా కనిపిస్తున్నాయని లంక సైన్యాధికారి ఒకరు చెప్పారు. ఈ విధమైన ప్రత్యేక బంకర్లలో ఎల్టీటీఈ ఉన్నత నాయకత్వం విదేశీయులతో, ఇతర ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం అయి ఉంటారని తెలిపారు.
చరిత్రలోకి పోయి చూస్తే రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో సైనిక బంకర్లను విస్తృతంగా ఉపయోగించేవారు. తర్వాత ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వాలతో పోరాటానికి దిగిన మిలీషియా గ్రూపులు కూడా బంకర్లను రూపొందించాయి. నాజీ అధినేత అడాల్ఫ్ హిట్లర్ తన రక్షణకోసం ఇలాంటి షెల్టర్లలోనే గడిపాడని తెలుసుకున్న తర్వాత బంకర్లపై క్రేజీ మరింతగా పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్య. |