భారత్ అందించిన సాక్ష్యాధారాలకు పాక్ కట్టుబడి దేశంలోని ఉగ్రవాదుల పని పట్టాలని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశీ శాఖ సహాయ కార్యదర్శి రిచర్డ్ బౌచర్ ఈ విషయమై పాక్ ప్రభుత్వానికి అమెరికా తరపున గట్టి సందేశాన్ని ఇచ్చారు. పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ, విదేశీ మంత్రి షా అహ్మద్ ఖురేషిలతో సమావేశమైన అనంతరం ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో బౌచర్ విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాదులకు పాక్ భూభాగంతో సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. భారత్ అందించిన సమాచారంపై పాక్ పరిశోధించాలని, లభ్యమవుతున్న సాక్ష్యాధారాల బట్టి ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని బౌచర్ పాక్‌కు సూచించారు. భవిష్యత్తులో తన భూభాగంనుంచి ఇలాంటి దాడులకు ఉగ్రవాదులు తలపడకుండా పాక్ జాగ్రత్త వహించాలని బౌచర్ తెలిపారు. ముంబై దాడులపై భారత్, పాకిస్తాన్‌కు సాక్ష్యాధారాలను అందించిన కొద్ది గంటలలోపే ఉగ్రవాదులపై చర్య గురించి బౌచర్ చేసిన ప్రకటన వెలువడడం గమనార్హం. బుధవారం భారత్ రానున్న బౌచర్, ముంబై దాడులలో అమెరికా దేశస్తులు ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన దృష్ట్యా అమెరికా విచారణపై నేరుగా జోక్యం చేసుకుందని, ఈ దాడులకు బాధ్యులైన వారిని పట్టుకోవాలని భావిస్తోందని బౌచర్ తెలిపారు. |