ఎల్టీటీఈని శ్రీలంక సైన్యం దాదాపు ఓడించే పరిస్థితి చేరువైనప్పటికీ, లంక జాతుల సమస్యను సైనిక పంథా పరిష్కరించలేదని, లంక ప్రభుత్వం తప్పనిసరిగా రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉందని భారత్ అభిప్రాయపడింది. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా పట్టుబడినట్లియితే, రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి భారత్‌లో విచారణను ఎదుర్కోవడానికి వీలుగా ప్రభాకరన్‌ను లంక భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. శ్రీలంక సమస్యలో పలు అంశాలు దాగి ఉన్నాయని, వీటిలో ఏ ఒక్కటీ సమస్యను దానికదేగా పరిష్కరించలేదని భారత్ విదేశీ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ చెప్పారు. ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం లేదని, సైనిక పరిష్కారం ఎలాంటి ఫలితాలను ఇచ్చినా సరే దానివల్ల ఒక పక్షం పైకి రావడం లేదా మరో పక్షం కిందికి పడిపోవడం అనేవి తప్పదని మీనన్ చెప్పారు.సైనిక పరిష్కారం మార్పును తీసుకు రావచ్చని అయితే శ్రీలంక సమస్యకు సంబంధించి సైనిక పరిష్కారం కంటే మించి మరొక పరిష్కారం అవసరమవుతుందని మీనన్ తెలిపారు. టైగర్ల చివరి కంచుకోట ముల్లైతీవుకు లంక సైన్యం చేరువవుతున్న నేపథ్యంలో, లంక సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని మీనన్ సూచించారు. శ్రీలంకలో ఎల్టీటీఈకి, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో పౌరులు చిక్కుకుని ఉన్నందున మానవతాదృష్టితో ఈ అంశాన్ని చూడాలని విదేశీ శాఖ కార్యదర్శి మీనన్ చెప్పారు. శ్రీలంక తమిళులకు భారత్ సహాయాన్ని అందిస్తోందని, భవిష్యత్తులోనూ ఈ సహాయాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారత్‌లో విచారణకు గాను ప్రభాకరన్‌ను భారత్‌కు అప్పగించాలని తాము పదే పదే కోరుతున్నామని చెప్పారు. |