పాకిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులే భారత్, పాకిస్థాన్‌లకు ఉమ్మడి శత్రువులని అమెరికా వెల్లడించింది. నవంబర్ 26న జరిగిన ముంబాయి దాడులపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమెరికా విదేశాంగ శాఖ విభాగపు ప్రతినిధి సీన్ మెక్‌కొర్నాక్ ఈ విషయాన్ని తెలిపారు.
వాషింగ్టన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పాక్ భూభాగం నుంచే దాడులు జరుగుతున్నాయంటూ అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి కండోలిజా రైస్ పాక్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కానీ ఇటీవలి కాలంలో భారత్, పాక్‌లు ఉగ్రవాద సమాచార మార్పిడి చేసుకోవడం ఆశావహ పరిణామంగా తాము భావిస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం శాంతికి విఘాతం కలిగించేదిగా మారుతోందని అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు. దీని వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా నిర్వర్తిస్తున్న కర్తవ్యాలకే కాకుండా.. పాక్ పొరుగు దేశమైన భారత్‌కు, ప్రపంచానికి కూడా ఎంతో హానికరమని తెలిపారు. |