శాంతికి విఘాతం కలిగించే దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉందనీ, పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల భారతదేశం అల్లాడిపోతోందని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. పాక్ ఉగ్రవాదుల బెడద భారత్‌కే కాక ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉగ్రవాదం పట్ల పాక్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నట్లు నటిస్తోందని అమెరికా నిఘా వర్గాలకు చెందిన ఒక అధికారి విమర్శించారు. జనవరిలో కొత్తగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అలంకరించనున్న బారక్ ఒబామా సైతం పాకిస్తాన్‌పైనే గురిపెట్టినట్లు సమాచారం. ఆఫ్ఘాన్, ఇరాక్ దేశాలకంటే పాకిస్తాన్ చాలా ప్రమాదకరమైన దేశంగా ఆయన అభిప్రాయపడుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి.
తాజాగా ముంబైపై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారి సాక్ష్యాలను మన దేశం ప్రవేశపెట్టినప్పటికీ... ఆ సాక్ష్యాలలో ఎటువంటి పసలేదని పాక్ కొట్టిపారేయడంపట్ల అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా. ఈ నేపధ్యంలో పాక్ పట్ల అమెరికా అనుసరించవలసిన విధానాలపై బారక్ ఒబామా తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై అగ్రరాజ్యం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. |