అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకు ప్రతిరోజు ప్రజలనుండి దాదాపు 40వేల ఉత్తరాలు అందుతున్నాయి. కాని వీటిలో కేవలం 10 ఉత్తరాలకే ఆయన సమాధానమిస్తున్నారు.వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్యశాఖ సమ్మేళనంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ...తనకు ప్రతిరోజు ప్రజలనుండి దాదాపు 40వేల ఉత్తరాలు అందుతున్నాయని వాటిలో కేవలం 10 ఉత్తరాలకు మాత్రమే తాను స్వయంగా సమాధానాలను ఇవ్వగలుగుతున్నానని ఆయన తెలిపారు. వైట్ హౌస్ అధికారులు, సిబ్బంది ఈ ఉత్తరాలను చదివి, వాటిలో నాకు కేవలం పది ఉత్తరాలను అందిస్తారని వాటికి మాత్రమే తాను సమాధానం ఇవ్వగలుగుతున్నానని ఆయన వివరించారు. వీలైనంత ఎక్కువ ఉత్తరాలకు తాను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని, ఈ ఉత్తరాల ప్రహసనంతో ప్రజలకు మరింత దగ్గరకావడానికి దోహదం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సమాధానం ఇచ్చే పది ఉత్తరాలలో ముఖ్యంగా మూడు ఉత్తరాలు ఆరోగ్య సంబంధమైనవేనని కాబట్టి ఆరోగ్యం విషయమై ప్రజలలో అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఆయన తన అధికారులకు సూచించారు. |