లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిపై న్యాయ విచరణకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై జరిపిన ప్రాధమిక నివేదిక సమర్పణపై పాక్ అధికారికంగా ఒక్క మాట కూడా వ్యాఖ్యానించలేదు. ఈనేపథ్యంలో పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ న్యాయ విచారణకు ఆదేశించారు.
ఇందుకోసం జస్టీస్ షబ్బర్ రజా రజ్వీ నేతృత్వంలో విచారణ కమిటీని పంజాబ్ ప్రొవిన్స్ గవర్నర్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా, గత మంగళవారం ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, పలువురు క్రికెటర్లు గాయపడిన విషయం తెల్సిందే.
గడాఫీ స్టేడియానికి సమీపంలో ఉన్న లిబర్టీ మార్కెట్ సమీపంలో ఈ దాడి జరిగింది. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ రెండు మూడు రోజుల్లో ప్రాధమిక నివేదికను సమర్పించింది. అయితే, నివేదిక సమర్పించిన అశంపై అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు.
పంజాబ్ రాష్ట్ర గవర్నర్‌గా సల్మాన్ తసీర్ వ్యవహిస్తున్న విషయం తెల్సిందే. ఈ దాడికి సంబంధించి పాక్ పోలీసులు సుమారు 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ కంటోన్మెంట్ ఏరియాలో పోలీసులపై కాల్పులకు దిగిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. మరో 12 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. |