రెండు వారాల క్రితం బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న బంగ్లా సరిహద్దు దళం (బంగ్లాదేశ్ రైఫిల్స్) తిరుగుబాటులో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న 150 మందిని బంగ్లా రక్షణ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో 36 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ తిరుగుబాటు వెనుక మిలిటెంట్లు, ఇతర బంగ్లా వ్యతిరేక శక్తుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.
జీత భత్యాలను పెంచాలని కోరుతూ బీడీఆర్ సైనికులు ఆర్మీ ఆఫీసర్లపై తిరుగుబాటు చేసి, 73 మందిని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ సంఘటన అటు బంగ్లాతో సహా, ఇటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురుచేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఆ దేశ సైనికాధికారులు గత నెల 25, 26 తేదీల్లో 33 గంటల పాటు విచారణ జరిపారు. ఇందులో సుమారు 150 మందికి సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
కార్యాలయంలో లభించిన వీడియో ఆధారాలు, పాద, హస్తముద్రికలు ఆధారంగా 36 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు. దీనిపై రక్షణ శాఖ అధికారి స్పందిస్తూ దోషుల గుర్తింపునకు వీడియో ఆధారాలతో సహా, తిరుగుబాటు సమయంలో పత్రికలు, ఎలక్ట్రానికి మీడియా తీసిన వీడియోగ్రాఫిక్ చిత్రాలను పరిశీలించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. అలాగే, మిలిటెంట్ల పాత్రపై విచారణ జరుపుతున్నట్టు పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఆర్మీ అధికారి వెల్లడించారు. |