మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భుట్టో హత్య కేసులో సంబంధం ఉన్న వారిపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. దీనికోసం తమ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే, ముషారఫ్ సైనిక పాలనలో తొలగింపునకు గురైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకర్ మొహ్మద్ చౌదరీతో సహా ఇతర జడ్జీల నియామకం తక్షణం చేపట్టాలని కోరారు. ఇందుకోసం తమ పార్టీ ర్యాలీలు నిర్వహిస్తుందని, ఇందులో అన్ని పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి చెందిన కార్యకర్తలు, న్యాయవాదులు హాజరుకావాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని బెనజీర్ భుట్టో హత్యకు గురికాకముందు ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఈ ఒప్పందాన్ని అధికార పిపిపి ప్రభుత్వం ఉల్లంఘించిన, పాలన సాగిస్తోందని షరీఫ్ ఆరోపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోందన్నారు. తీవ్రవాదులు, ఉగ్రవాదుల ఆదేశాలకు తలొగ్గి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన దుయ్యబట్టారు. |