పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్యను మరింత ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా గురువారం సైనిక బలగాలు జరిపిన దాడుల్లో గురువారం ఓ అతివాద మతపెద్ద కుమారుడు మృతి చెందాడు.
తాలిబాన్ల మద్దతుదారుడైన సుఫీ కుమారుడు పాక్ భద్రతా దళాల దాడుల్లో మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తాలిబాన్లకు, ప్రభుత్వానికి మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాదాస్పద శాంతి ఒప్పందం కుదరడంలో సుఫీ కీలకపాత్ర పోషించారు.
ఇదిలావుంటే గురువారం స్వాత్ లోయలోని తాలిబాన్ల స్థావరాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో వేలాది మంది పౌరులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
అతివాద మతపెద్ద సుఫీ మొహమ్మద్ కుమారుడు కిఫయతుల్లా దీర్ జిల్లాలో భద్రతా దళాలు చేసిన దాడిలో మృతి చెందారు. మరోవైపు తాలిబాన్లతో ఇకపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వారితో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం ఎటువంటి ఫలితం ఇవ్వని కారణంగా, వారిని అణిచివేసే వరకు తమ సైనిక చర్యలు అగవని తేల్చిచెప్పింది. స్వాత్ లోయలోని ములాం, జబ్బా, మట్టా, ఖవాజా ఖేలా ప్రాంతాల్లోని తాలిబాన్ తీవ్రవాదులను పాక్ భద్రతా దాళాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. |