శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడపడంతోపాటు, కొంత భూభాగాన్ని ఏళ్ల తరబడి ఆధీనంలో ఉంచుకున్న ఎల్టీటీఈని పూర్తిగా నాశనం చేశామని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇకపై ఎల్టీటీఈ లేదా మరే ఇతర తీవ్రవాద సంస్థను వేళ్లూనుకోకుండా చూస్తామని స్పష్టం చేసింది.
శ్రీలంకలో ఇటీవల ముగిసిన యుద్ధంలో 5000 మందికిపైగా ఎల్టీటీఈ తీవ్రవాదులు ప్రభుత్వ దళాలకు లొంగిపోయారని వెల్లడించింది. లంక రక్షణ శాఖ కార్యదర్శి గోథాబాయా రాజపక్స మాట్లాడుతూ.. లొంగిపోయిన తీవ్రవాదుల్లో నేరచరిత ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని, మిగిలినవారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. దేశంలో తిరిగి ఎల్టీటీఈ పుంజుకునే అవకాశం లేదని చెప్పారు. |