కొలంబియాతో అన్ని దౌత్య సంబంధాలు తెంచుకునేందుకు తాము సిద్ధమవుతున్నామని వెనిజులా అధ్యక్షుడు హుగో చావెజ్ హెచ్చరించారు. కొలంబియా ప్రభుత్వం వారి మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతిస్తుండటం వెనిజులాకు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై ఇప్పుడు వెనిజులా ప్రభుత్వం పొరుగునున్న కొలంబియాతో అన్ని దౌత్య సంబంధాలు తెంచుకోవాలనుకుంటుంది. కొలంబియాలో అధికారంలో ఉన్న అల్వారో ఉరిబ్ ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సంబంధాలు పునరుద్ధరించుకునే ఏమాత్రం ఆస్కారం లేదని చావెజ్ స్పష్టం చేశారు.
కొలంబియాతో దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిపివేసేందుకు చర్యలు చేపట్టాలని తన విదేశాంగ మంత్రికి చావెజ్ సూచించారు. ఇది జరగబోతుంది. దీనికి సిద్ధం కానివ్వండని చావెజ్ వ్యాఖ్యానించారు.
కొలంబియాలోని ఏడు సైనిక స్థావరాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతిస్తూ ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొలంబియా సైనిక స్థావరాలను అమెరికా పదేళ్లపాటు లీజుకు తీసుకునే ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండటంపై వెనిజులా గత కొన్ని వారాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.