సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఆధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చాలని పాకిస్థాన్ కోరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ అమెరికాను అభ్యర్థిస్తూ ఓ లేఖ రాశారు. అలాగే, ఉగ్రవాదం నిర్మూలకు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా మరింత పెంచాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. అమెరికా రక్షణ శాఖ అధికారులతో పాటు.. ఎఫ్‌బీఐ అధికారులతో హోం మంత్రి పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. పాక్‌లో విజృంభిస్తున్న ఉగ్రవాదం/తీవ్రవాదంపై దృష్టి సారించాలని అమెరికాకు చిదంబరం విజ్ఞప్తి చేశారు.
ఈ తరుణంలోనే ఉగ్రవాదంపై పోరుకు ఆధునిక ఆయుధాలు కావాలని అమెరికాను పాక్ అభ్యర్థించడం గమనార్హం. సమస్యల నుంచి అమెరికాతో పాటు.. ఇతర దేశాల దృష్టిని మరల్చేందుకే పాక్ ఇలాంటి అభ్యర్థన చేసిందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.