శ్రీలంకలో ఎల్టీటీఈ- ప్రభుత్వ దళాల మధ్య ఇటీవల జరిగిన చివరి దశ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 3 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు శ్రీలంక ప్రభుత్వానికి 3 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా తెలిపింది.
శ్రీలంకలో ఎల్టీటీఈపై పోరు కొన్ని నెలల క్రితం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధం ముగిసిన తరువాత నిరాశ్రయులైన పౌరులకు పునరావాసం కల్పించడం శ్రీలంక ప్రభుత్వానికి సవాలుగా మారింది. పలు దేశాలు ఇందుకోసం శ్రీలంక ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా 3 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తామని, శరణార్థ శిబిరాల్లో ఉంటున్నవారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ తెలిపారు. తాము అందించే సాయం శ్రీలంక శరణార్థులకు వచ్చే నెల నుంచి ఉపయోగించే అవకాశం ఉందన్నారు.