ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం తీవ్రవాదానికి ప్రధాన కేంద్రంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉంటున్న తీవ్రవాదుల నుంచి అమెరికాను, దాని మిత్రదేశాలను కాపాడటమే బరాక్ ఒబామా యంత్రాంగం ప్రధాన ధ్యేయమన్నారు.
అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలను తీవ్రవాదం నుంచి కాపాడటమే తమ లక్ష్యమని న్యూస్ అవర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్- పాక్ సరిహద్దు ప్రాంతాన్ని తీవ్రవాద కేంద్రంగా ఆమె వర్ణించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అల్ ఖైదా లేదని కొందరు అంటున్నారు.
అయితే ఆఫ్ఘన్ ప్రాంతం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతే అల్ ఖైదా మళ్లీ వేగంగా విస్తరించగలదని హిల్లరీ తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించే ఒబామా యంత్రాంగం తీవ్రవాద సమస్యను పరిష్కరించాలనుకుంటుందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొత్త ఆఫ్ఘన్ విధానం అమల్లోకి తేబోమని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.