ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఉగ్రవాద స్థావరాలపై జోరుగా పాక్ సైన్యం దాడులు (Pakistan | Afghanistan | Attact | Zardari | Gilani | Militery | International)
తమ భూభాగంలో తిష్టవేసిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే పనికి పాకిస్థాన్ శ్రీకారం చుట్టింది. ఆఫ్గనిస్థాన్-పాక్ సరిహద్దుల్లో ఉన్న గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో పాతుకుపోయిన తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా దక్షిణ వజిరిస్థాన్‌లోని అల్‌ఖైదా, తాలిబాన్ లక్ష్యాలపై పాక్ సైన్యం నాలుగో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది.
తాలిబాన్లకు ఆయువుపట్టుగా ఉన్న కేంద్రాన్ని మూసివేసే ప్రయత్నంలో ఆఫ్గనిస్థాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో సైన్యం ఐదు తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసింది. అయితే, ఇరు వర్గాల మధ్య హోరాహోరిగా సాగుతున్న పోరులో ప్రాణ నష్టానికి సంబంధించి స్పష్టమైన సమాచారం వెల్లడి కావడం లేదు. ఉభయ పక్షాల్లో ఎక్కువ నష్టం వాటిల్లినట్టు సమాచారం.
కాగా, యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి లక్షలాది మంది సామాన్య ప్రజానీకం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళిపోతున్నారు. అలాగే, దాడులు ఆరంభమైనప్పటి నుంచి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ సైనికాధికారులు తెలిపారు. ఆఫ్గనిస్థాన్‌లోకి వెళ్ళే పర్వత ప్రాంతంలోని కీలక మార్గం ఇంగాల్‌మాల్‌పై సైన్యం పట్టు సంపాదించిందని తెలిపారు.
సైన్యం దాడులను తాలిబాన్ తీవ్రవాదులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఇదిలావుండగా, భద్రతా కారణాలరీత్యా ఇస్లామాబాద్‌తో పాటు.. కీలక నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలను వారం రోజుల పాటు మూసి వేయాల్సిందిగా పాక్ ప్రభుత్వం ఆదేశించింది. దాడుల కారణంగా దేశ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.