వరిజిస్థాన్ దాడులు.. పాకిస్థాన్‌కు మద్దుతు: అమెరికా
మంగళవారం, 20 అక్టోబర్ 2009( 14:45 IST )
ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వరిజిస్థాన్‌లో అల్లుకుపోయి ఉన్న తాలిబాన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న దాడులకు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే ఏ తరహా దాడులనైనా అమెరికా సమర్థిస్తుందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
దీనిపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాక్ సైన్యం చేస్తున్న దాడులకు తమ మద్దతు ఉన్నట్టు చెప్పారు. అయితే, తాలిబాన్ తీవ్రవాదులతో పాకిస్థాన్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా అధికారులు చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది తనకు తెలియదన్నారు.
పాక్-తీవ్రవాదుల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు పేర్కొంటూ ఏ ఒక్క ప్రకటన విడుదల కాలేదని అన్నారు. తీవ్రవాదులపై పోరాటం సాగించేందుకు ఇరు దేశాలకు ఓ లక్ష్యం ఉందన్నారు. ఆ తరహాలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.