ఇండో-అమెరికా అణు ఒప్పందానికి ఒబామా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా సహాయ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీతో అమెరికాకు గల సంబంధాలు ఎంతటి బలమైనవో ఈ ఒప్పందం తెలియజేస్తుందని హిల్లరీ వెల్లడించారు.
అణు ఒప్పందానికి తాను ఓ సెనేటర్‌గా మద్దతునిస్తుంటే, ప్రభుత్వపరంగా ఒబామా అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయి మద్దతు పలుకుతోందని అన్నారు. భారతదేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందం విభిన్నమైనదనీ, మిగిలిన దేశాలతో అమెరికా ఇటువంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదని హిల్లరీ పేర్కొన్నారు.
కొన్ని దేశాలు ఇండో-అమెరికా అణు ఒప్పందం తరహాలో తమతో ఒప్పందం చేసుకోవాలని అభ్యర్థించినప్పటికీ తాము వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. భారతదేశంపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నందువల్లే అటువంటి ఒప్పందానికి చొరవ చూపామని, భారతదేశం కూడా అమెరికా పట్ల ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తోందని హిల్లరీ వెల్లడించారు.
వచ్చే నెల 24వ తేదీన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామనీ, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలను చేకూర్చగల వివిధ రంగాలపై తాము దృష్టి సారించనున్నట్లు తెలిపారు.